సత్య స్థాపకుడు


సత్య స్థాపకుడు


సత్య స్థాపకుడు

 
సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని వాహనమెక్కి బయలుదేరుము నీ దక్షిణహస్తము భీకరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పును. -కీర్తనలు 45:4

సత్యము వినయము నీతి అనే అంశాలు లోకం చేత ఎగతాళి చేయబడే అంశాలుగా ఉన్నాయి. ఈ మూడింటిని కలిగిన వారు ఎవరు విజయం సాధించడం ఈ లోకంలో సాధ్యం కాదనేది ఎక్కువ మంది కలిగి ఉన్న అభిప్రాయం. వీటికి రోజులు లేవని ఇంకొంతమంది మాట్లాడుతుంటారు.

సత్యము లేకపోయెను చెడుతనము విసర్జించువాడు దోచబడుచున్నాడు న్యాయము జరుగకపోవుట యెహోవా చూచెను అది ఆయన దృష్టికి ప్రతికూలమైయుండెను. -యెషయా 59:15

లోకంలో నిజంగానే సత్యము లేకపోయిన పరిస్థితిని, మంచి జీవితాన్ని జీవించాలి అనుకునేవాడు ఇబ్బందులు ఎదుర్కోవడాన్ని ఆనాటి నుండి ఈనాటి వరకు మనం చూస్తూనే ఉన్నాము.

కీర్తనల గ్రంథం 45: 4 లో ఉపయోగించబడిన సత్యము అనే పదానికి స్థిరము, దృఢము, వాస్తవము, ఖచ్చితము, చెల్లుబాటు, నమ్మకత్వము, నిలకడ ఆధారపడదగిన అనే అర్థాలు ఉన్నాయి.

ఏసుక్రీస్తు వారు తన గురించి తాను సత్యము అని చెప్పుకున్నాడు, అనగా ఆయన స్థిరమైన వాడు, దృఢమైన వాడు, వాస్తవమైన వ్యక్తి, కచ్చితంగా మాట్లాడేవాడు, అన్ని కాలములలోను చెల్లుబాటు కలిగిన వాడు, నమ్మకత్వం కలవాడు, నిలకడగా ఉన్నవాడు, ఆధారపడదగినవాడు అని చెప్పవచ్చు.

ఈ లోకములోనికి ఆయన రావడానికి గల కారణం సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడమే.

అందుకు పిలాతునీవు రాజువా? అని ఆయనను అడుగగా యేసునీవన్నట్టు నేను రాజునే; సత్యమునుగూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని; ఇందు నిమిత్తమే యీ లోకమునకు వచ్చితిని; సత్యసంబంధియైన ప్రతివాడును నా మాట వినుననెను. -యోహాను 18:37

దేవుడు ఈ లోకమును సృజించాడు అని సాక్ష్యం ఇవ్వడానికి, ఈ లోకమును నాశనం చేస్తున్న పాపమునకు లేదా చెడ్డ దానికి వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వడానికి, తాను ఇచ్చే ఈ సాక్ష్యము ద్వారా తన రాజ్యమును స్థాపించి కొనసాగించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఏసుక్రీస్తు వారి రాజ్యములో సత్యమే నిత్యము రాజ్యమేలుతుంది.

సత్యమును ప్రత్యక్ష పరచడానికే, సత్యవంతుడైన దేవుని ఆయన చిత్తమును ఈ లోకమునకు ప్రత్యక్ష పరచడానికి ఏసుక్రీస్తు వారు రావడం జరిగింది. దేవుడి ప్రత్యక్షత అనుగ్రహించకపోతే అది ఏమాత్రం సాధ్యం కాదు.

నీవు నాయందు ఉంచిన ప్రేమ వారియందు ఉండునట్లును, నేను వారియందు ఉండునట్లును, వారికి నీ నామమును తెలియజేసితిని, ఇంకను తెలియ జేసెదనని చెప్పెను. -యోహాను 17:26

ఒకవైపు దేవుని యొక్క నిజాయితీని, నమ్మకత్వమును, స్థిరపరుస్తూ, తాను చేసిన అనేకమైన ఆశ్చర్య కార్యముల ద్వారా తాను ప్రత్యక్ష పరచిన సత్యమును స్థిరపరుస్తూ తన రాజ్యమును స్థాపించిన వాడిగా ఉన్నాడు.

నేను చెప్పునదేమనగా, పితరులకు చేయబడిన వాగ్దానముల విషయములో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకును, అన్యజనులు ఆయన కనికరమును గూర్చి దేవుని మహిమపరచుటకును క్రీస్తు సున్నతి గలవారికి పరిచారకుడాయెను. -రోమీయులకు 15:8

ఆయన రాజ్యమునకు పునాది సత్యమే. సత్యమును బట్టి తన ప్రభావమును ఆయన కనబరుస్తాడు. ఆయన మార్గములు సత్యములై ఉన్నాయి, ఆయన తన విశ్వాస్యతను బట్టి, సత్యమును బట్టి తీర్పు తీర్చేవాడుగా ఉన్నాడు.

వారు ప్రభువా, దేవా, సర్వాధికారీ, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి; యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములును సత్యములునై యున్నవి; -ప్రకటన గ్రంథం 15:3 
భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు న్యాయమును బట్టి లోకమునకు తన విశ్వాస్యతను బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చును. -కీర్తనలు 96:13
అందుకు అవును ప్రభువా, దేవా, సర్వాధికారీ, నీ తీర్పులు సత్యములును న్యాయములునై యున్నవని బలిపీఠము చెప్పుట వింటిని.-ప్రకటన గ్రంథం 16:7

కాబట్టి అబద్దమునకు జనకుడైన సాతాను యొక్క బోధల నుండి ప్రభావం నుండి విడుదల పొంది, సత్యమును పరిచయం చేసి స్థాపించుటకు ఈ లోకమునకు వచ్చి, తన కార్యముల ద్వారా దానిని స్థిరపరిచి పరలోకమునకు తండ్రి యొద్దకు ఆరోహనుడై వెళ్లి సత్యమును బట్టి తీర్పు తీర్చుటకు, సత్యమనే పునాది మీద తన రాజ్యమును సంపూర్ణంగా స్థాపించుటకు త్వరలో తిరిగి రానయున్న ఏసుక్రీస్తు వారిని మన హృదయంలో చేర్చుకుని సత్య సంబంధులమై ఆయన మాట వింటూ ఈ లోకంలో కొనసాగుటకు ప్రయత్నం చేద్దాం. అలాంటి భాగ్యము దేవుడు మనకు దయచేయును గాక ఆమెన్.

Post a Comment