దేవుడు అలాంటి వారిని అసలు ఎందుకు ఎన్నుకుంటాడు ? ఎలా ఎన్నుకోగలడు ??
దేవుడు ఒక వ్యక్తిని ఎందుకు ఎన్నుకున్నాడు అనే దానికి కారణం దేవునికి మాత్రమే తెలుసు, వీరినే నీవు ఎందుకు ఎన్నుకున్నావని దేవునిని అడిగే హక్కు మనకెవరికీ లేదు.
పరిచయం :
ఒక మనిషి తనకున్న బలహీనతలను తనకు దేవుడు అప్పగించిన గొప్ప పనిని ఆ పనికి అవసరమైన అర్హతలను సరిపోల్చి చూసినప్పుడు నన్నే ఎందుకు ఎన్నుకున్నావు ప్రభువా అనే ప్రశ్న ఖచ్చితంగా కలుగుతుందని గడిచిన భాగంలో తెలుసుకున్నాము.
దేవుని వాక్యమును ఆసక్తిగా ఆలకించుటకు ఎదురుచూస్తున్న మీకందరికి శుభములు తెలియజేస్తూ మిమ్మలను ప్రేమతో రెఫీదీమ్ వాక్య ధ్యాన సమయముకు ఆహ్వానిస్తున్నాను.
అందరూ బాగున్నారా, దేవుడు బలహీనులను సాధారణమైన వ్యక్తులను ఎన్నుకుంటాడని గడిచిన భాగంలో తెలుసుకున్నాం కదా, మరి అలాంటి వారిని దేవుడు ఎందుకు ఎన్నుకుంటాడు? ఎలా ఎన్నుకోగలడు! అనే విషయాలు తెలుసుకుందాం.
దేవుడు వీరిని మాత్రమే ఎన్నుకోవడానికి కారణమేమిటి?
ఇంతకుముందు చెప్పినట్టుగానే వారందరూ సాధారణమైన వ్యక్తులు, మరియు అనేకమైన బలహీనతలు కలిగిన వారు.
ఉదాహరణకు అబ్రహాము జీవితాన్ని చూస్తే ఆయన రెండుసార్లు అబద్ధాలాడినట్టు బైబిల్ లో రాయబడింది, ఇస్సాకు కూడా అబద్ధమాడాడు, యాకోబు మరి ఎక్కువ అబద్దాలాడాడు, మోసం చేశాడు.
మరి వీరిని దేవుడు ఎలా ఎన్నుకున్నాడు? కేవలము ఆయన కృప చేతనే, వారి ఎన్నికలో వారి గొప్పతనం ఏమీ లేదు.
దేవుడు ఒక వ్యక్తిని ఎందుకు ఎన్నుకున్నాడు అనే దానికి కారణం దేవునికి మాత్రమే తెలుసు, వీరినే నీవు ఎందుకు ఎన్నుకున్నావని దేవునిని అడిగే హక్కు మనకెవరికీ లేదు.
మనం ఈ లోకంలో జన్మించుటకు ముందే దేవుని కుటుంబంలో మనము సభ్యులము కావాలని దేవుడు మనలను ఎన్నుకున్నాడు, మనం ఎలాంటివారేమో దేవుడు ఎరిగినప్పటికీ మన ద్వారా కొన్ని పనులు నెరవేర్చుకొనడానికి దేవుడు మనలను ఎన్నుకున్నాడు.
షేతు సంతానములో దేవుడు ఎన్నిక చేసిన మనుషులను మనం గమనిస్తే, ఆ కుటుంబంలో ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ఉంటే దేవుడు ఒక్క వ్యక్తిని మాత్రమే ఎన్నుకొని మిగతా వారిని పక్కకు పెట్టినట్లు చూడవచ్చు.
అబ్రహాము తర్వాత ఇస్సాకు, ఇష్మాయేలు ఇద్దరు ఉన్నారు, దేవుడు ఇష్మాయేలును ఎన్నుకోలేదు, ఇస్సాకుకు కూడా ఏశావు యాకోబు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఏశావు యాకోబు అనే వారిలో కూడా యాకోబును మాత్రమే దేవుడు ఎన్నుకున్నాడు.
వీరు ఎన్నికల్లో పక్షపాతం లేదు గాని దేవుని కృప, ఆయన సార్వభౌమ అధికారం మాత్రమే కనబడుతున్నది. అంతేకాదు దేవుని ఎన్నికలకు లేదా ఆయన సార్వభౌమ అధికారానికి మనము ఎలా స్పందిస్తామో అనేది కూడా చాలా ముఖ్యం.
దేవుడు తన సార్వభౌమ అధికారం చొప్పున ఒక నిర్ణయం చేసినప్పటికీ, మనుషులుగా ఆయన మనకు ఇచ్చిన స్వేచ్ఛను బట్టి ఆ ఎన్నికలో నుండి తొలగిపోయి మనకు ఇష్టమైన దారిని మనము ఎంచుకొనగలిగే అవకాశం ఉన్నది.
దేవుడు ఆ విషయంలో అడ్డం రాడు, దేవుడు వదిలిపెట్టిన వారందరు దేవుని పట్ల విశ్వాసం లేక, ఆయనతో సహవాసము లేక జీవించినవారే. దేవుడు ఎన్నుకున్నవారిలో ఎన్ని బలహీనతలు ఉన్నా వారి విశ్వాసము, ప్రతి సమయంలో వారు దేవునికి స్పందించే విధానము వారిని ఆ ఎన్నికలో నిలవబెట్టింది.
దేవుడు తన కృప ద్వారానే నేడు ఈ సత్యాన్ని నీకు అందింపచేస్తున్నాడు, విశ్వాసంతో నీవు స్పందిస్తే దేవుని గొప్ప కార్యములు నీ జీవితంలో కూడా నీవు చూడగలుగుతావు.
ముగింపు :
దేవుని ఎన్నికలో నుండి తొలగిపోక, ఆయన అధికారమును ధిక్కరించక, ఆయన కృపను దుర్వినియోగపరచక దేవుని చిత్తమును నెరవేర్చుదాం.
ప్రభు చిత్తమైతే మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు ప్రభువు కృప మనకు తోడైయుండును గాక. ఆమెన్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి