సమూయేలు ఎదుగుదల కలిగి ఉన్నాడు
బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయయందును మనుష్యుల దయ యందును వర్ధిల్లుచుండెను. 1 సమూయేలు 2:26
హాయ్ పిల్లలు బాగున్నారా? మీరందరూ ఇప్పుడు ఒక పని చేయాలి? ఏం చేయాలంటే… మీరు ఒక్కొక్కరు పైకి లేచి మీ పేరు వయసు బరువు చెప్పాలి! ఏంటి ఎవరు చెప్పట్లేదు! ఓ మీ బరువు మీకు తెలియదా? సరే వచ్చేవారం అందరూ మీ వయసు బరువు తెలుసుకొని చెప్పాలి! నేను మిమ్మల్ని ఎందుకు ఈ ప్రశ్న అడిగానంటే, మనమందరం కూడా వయసుకు తగ్గ బరువు ఉండాలి. అలా ఉండటం ఆరోగ్యకరము.
మనకు ఆరోగ్యం ఇచ్చేవాడు దేవుడే, సమూయేలు ఏలి తాత దగ్గర ఉంటూ దేవునికి పరిచర్య చేస్తూ క్రమ క్రమంగా పెద్దవాడయ్యాడు, మూడు సంవత్సరాలు వయసులో సమూయేలు ఏలి తాత దగ్గరికి వచ్చాడు కదా!
ఇప్పుడు సమూయేలు ఏలి తాత దగ్గరికి వచ్చి సుమారుగా ఒక ఐదు సంవత్సరాలు గడిచిపోయిన అనుకుందాం! ఇప్పుడు సమూయేలు వయసెంత ఉండవచ్చు?? ఎస్ 8 సంవత్సరాలు! అంటే సమూయేలు చాలా మారిపోయి ఉండి ఉంటాడు కదా! అవును కొంచెం ఎత్తు పెరిగి ఉంటాడు, బరువు కూడా పెరిగి ఉంటాడు, మంచిగా బలంగా కూడా తయారయ్యి ఉంటారు.
పిల్లలు, మీరందరూ శారీరికంగా ఎదగాలి, మానసికంగా కూడా ఎదగాలి. శారీరికంగా ఎదగటం అంటే ఏంటి? మనకు వయసు పెరుగుతున్న కొలది మన శరీరంలో కొన్ని మార్పులు జరగాలి, అలా జరుగుతూ ఉంటే మనము ఆరోగ్యకరంగా ఎదుగుదల కలిగి ఉన్నామని అర్థం, అలా లేకపోతే ఏదో చిన్నచిన్న లోపాలు ఉన్నాయని అర్థం.
మీరు సరిగా ఎదుగుదల కలిగి ఉండకపోతే మీ తల్లిదండ్రులు మీ విషయమై చాలా కంగారు పడతారు, తెలుసా మీలో కొంతమంది పిల్లల తల్లిదండ్రులు , మా అబ్బాయి ఎత్తు పెరగటం లేదని, మా అమ్మాయి బరువు పెరగడం లేదని బాధపడుతూ ఉంటారు. వయసుతోపాటు ఎత్తు బరువు పెరగడం, బలంగా తయారు కావడం మన యొక్క శారీరిక ఎదుగుదలలో భాగమే.
మనము ఈ విధంగా శారీరిక ఎదుగుదల కలిగి ఉండాలి అంటే పోషక ఆహారం తీసుకోవాలి, నేను అవి ఇవి తినను అని మారం చేయకూడదు, కూరగాయలు ఆకుకూరలు, పాలు గుడ్లు మాంసము ఇలా మన శరీరానికి మేలు చేసే ప్రతి ఒక్కటి మనము తీసుకోవాలి. ఇంట్లో మీ అమ్మ వాళ్లు మీ కోసం ఏమైతే కష్టపడి వండి పెడతారో, అవి తినండి, బయట తిండి కావాలని మారాం చేయకండి. పిల్లలు మీరు అలా చేస్తున్నారా?
రెండవది శుభ్రంగా ఉండాలి, మురికి మురికిగా ఉండకూడదు, సరిగా స్నానం చేయకుండా ఉండకూడదు. అలా ఉంటే గజ్జి తామర వంటి చర్మవ్యాధులు వస్తాయి. కాబట్టి ఎప్పటికప్పుడే శుభ్రంగా ఉండటం అనేది చాలా అవసరం. గోర్లు పెంచుకోకూడదు, అలా పెంచుకుంటే అందులోకి మట్టి చేరి, మనం ఆహారం తినేటప్పుడు మన నోట్లోకి వెళ్ళిపోతుంది.
మూడవదిగా మంచిగా నిద్రపోవాలి, మీలో కొంతమంది నిద్ర పోవలసిన సమయంలో ఆట్లాడతారు, ఆడుకోవలసిన సమయంలో చదువుకోవాల్సిన సమయంలో నిద్ర పోతారు. అది ఏమాత్రం మంచిది కాదు, మనము మంచిగా నిద్రపోవడం ద్వారా మన శరీరము ఆరోగ్యకరంగా ఉంటుంది.
నాలుగవది వ్యాయామం, అంటే చక్కగా ఆటలాడాలి, ఆటల పోటీలలో పాల్గొనాలి. నేను ఆటలాడమని చెప్తుంది ఫోన్లో కాదు , మీ స్నేహితులతో మీకు నచ్చిన ఆట ఒంటికి శ్రమ కలిగించే ఆట ఆడండి. అప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాము.
అన్నిటికీ మించి దేవుని సహాయం కావాలి, దేవునికి ఇష్టంగా ఉండాలి. అప్పుడు మనము మంచి ఎదుగుదల కలిగి ఉంటాము. మనము ఆరోగ్యంగా ఉండాలని, మంచి ఎదుగుదల కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మీకు విషయం తెలుసా, సమూయేలే కాదు యేసయ్య కూడా భూలోకములో మీలాగా చిన్న బాబుగా ఉన్నప్పుడు మంచి ఎదుగుదల కలిగి ఉన్నాడు.
కాబట్టి పిల్లలు దేవుడు మీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి దేవునికి వందనాలు చెప్పండి, మీకు ఎదుగుదల సరిగా లేకపోతే యేసయ్య నాకు మంచి ఎదుగుదల బలము దయచేయమని ప్రార్థన చేయండి. అంతేకాదు ఈరోజు పాఠంలో నేర్చుకున్నట్టుగా ఆరోగ్యకరంగా ఉండటానికి నేను పాటించవలసిన వాటన్నిటినీ పాటిస్తాను అని కూడా యేసయ్యతో చెప్పండి. ఆరోగ్యానికి మించిన భాగ్యము ఇంకొకటి లేదు, కాబట్టి ఆరోగ్యకరమైన ఎదుగుదల దేవుడు మీకందరికీ అనుగ్రహించును గాక ఆమెన్.
కంఠత వాక్యము :
యేసు జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయయందును, మనుష్యుల దయ యందును వర్ధిల్లు చుండెను. -లూకా 2:52
పునర్విమర్శ ప్రశ్నలు :
- మనము మంచి ఎదుగుదల కలిగి ఉండాలంటే అవసరమైన ఐదు విషయాలు ఏంటి?
- సమూయేలు వలె ఎదుగుదల కలిగి ఉన్న మరొక వ్యక్తి ఎవరు?
- సమూయేలు చిన్నవాడుగా ఉన్నప్పుడు, కొంచెం ఎదిగిన తర్వాత ఎలా ఉండి ఉంటాడో ఊహించి రెండు వేరు వేరు బొమ్మలు గీయండి!

కామెంట్‌ను పోస్ట్ చేయండి