సమూయేలు దేవునికి పరిచర్య చేసాడు


సమూయేలు దేవునికి పరిచర్య చేసాడు

సమూయేలు దేవునికి పరిచర్య చేసాడు

తరువాత ఎల్కానా రామాలోని తన యింటికి వెళ్లి పోయెను; అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలీ యెదుట యెహోవాకు పరిచర్యచేయుచుండెను. బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఏఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్యచేయు చుండెను. వాని తల్లి వానికి చిన్న అంగీ ఒకటి కుట్టి యేటేట బలి అర్పించుటకు తన పెనిమిటితోకూడ వచ్చినప్పుడు దాని తెచ్చి వాని కిచ్చుచు వచ్చెను. -1 సమూయేలు 2:11,18,19
తరువాత సమూయేలు ఉదయమగువరకు పండుకొని, లేచి యెహోవా మందిరపు తలుపులను తీసెనుగాని, భయపడి తనకు కలిగిన దర్శన సంగతి ఏలీతో చెప్పక పోయెను. -1 సమూయేలు 3:15

హాయ్ పిల్లలు బాగున్నారా? సమూయేలు జీవితం నుండి నేర్చుకుంటున్న పాఠాలు మీకు సంతోషమును ఇస్తున్నాయా? గతంలో సమూయేలు దేవునిని ఆరాధించాడని, పిల్ల చేష్టలు మానివేశాడని, ఏలిని గౌరవించాడని తెలుసుకున్నాము. 

అలా కొంతకాలం గడుస్తూ ఉండగా, సమూయేలు కొంచెం పెద్దవాడయ్యాడు. సమూయేలు ఏలి తాతకు సహాయం చేయడం మాత్రమే కాకుండా దేవుని పనిలో భాగం పంచుకోవడం ప్రారంభించారు. ఏలితాతకు సహాయం చేయడం కూడా దేవుని పనిలో భాగమే. 

 అంత చిన్న వయసులో సమూయేలు దేవునికి పరిచర్య చేశారు. సమూయేలు దేవునికి పరిచర్య చేశాడు అంటే ఏం చేసి ఉంటాడు? సమూయేలు త్వరలోనే చదవడం రాయడం నేర్చుకుని ధర్మశాస్త్రము చదివేవాడుగా ఉండి ఉంటాడు. ఏలీ తాతకు సహాయంగా కొన్ని పనులు చేయడానికి పరిగెత్తడం, కొన్ని పాత్రలు తీసుకురావడం, ఏలి తాత పనిచేస్తున్నప్పుడు కొన్ని పాత్రలు పట్టుకోవడం ఇవన్నీ దేవుని పరిచర్యలో భాగమే. 

అంతే కాదు దేవుని మందిరంలోనే సమూయేలు పడుకుని ఉండేవాడు కనుక ఆ మందిరపు తలుపులు తెరవడం, మూయడం, వెలుతురు నిమిత్తమై దేవుని మందిరంలో బంగారు దీప వృక్షం ఉండేది, అక్కడ ఉన్న దీపాలలో నూనె నింపడం, అవి ఆరిపోకుండా చూడడం ఇవన్నీ సమూయేలు దేవునికి పరిచర్యలో భాగంగా చేసేవాడు. ఇలా సమూయేలు దేవునికి పరిచర్య చేస్తూ ఉండగా ఎఫోదు ధరించుకొని పరిచర్య చేసే అవకాశాన్ని ఏలి సమూయేలుకు ఇచ్చాడు. 

ఎఫోదు అనేది యాజకులు ధరించుకునే ప్రత్యేకమైన వస్త్రం, సమూయేలు అప్పటికి ఇంకా యాజకుడు కాకపోయినా, ఒక బుల్లి యాజకునిగా దేవుని మందిరంలో పరిచర్య చేసే అవకాశాన్ని పొందాడు, వాళ్ళ అమ్మగారు కూడా సమూయేలుకు నూతన అంగీలు కుట్టి తీసుకొని వచ్చి ఇస్తూ ఉండేది.

పిల్లలు మీరు దేవునికి పరిచర్య చేస్తున్నారా? ఇతరులకు సహాయం చేయడం, దేవుని మందిరమును శుభ్రపరచడం, మీ వయసులో మీ చేతనైన పని దేవుని కొరకు చేయడం మీరు చేస్తున్నారా? మీరు పరిచర్య చేయడం ద్వారా దేవుడు మిమ్మల్ని ఇంకా ఎక్కువగా దీవిస్తాడు.

కంఠత వాక్యము :

…..సమూయేలు……లేచి యెహోవా మందిరపు తలుపులను తీసెను…. -1 సమూయేలు 3:15

పునర్విమర్శ ప్రశ్నలు :

  • సమూయేలు దేవునికి పరిచర్య చేయడంలో భాగంగా చేసిన ఐదు పనులను తెలియపరచండి?
  • సమూయేలు వలె మీరు దేవుని మందిరంలో పరిచర్య చేయడానికి ఏమి చేస్తారో రాయండి?

Post a Comment