వింతైన కార్యములు చేయు దేవుడు
దేవుడు నీ జీవితంలో కూడా ఇలాంటి కార్యాలు జరిగించాడా? అయితే దేవుని స్తుతించు. ఇశ్రాయేలు వలే శ్రమనుభవిస్తున్నావా నిన్ను విమోచించుటకు వింతైన కార్యములు నేటికీ కూడా చేయగల దేవుడు నీ పక్షాన ఉన్నాడని తెలుసుకో.
పరిచయం :
దేవుడు తన ప్రజలను విమోచించడానికి ఎంత దూరమైనా వెళ్తాడు, ఏమైనా చేస్తాడు. సత్యాన్వేష్కులకు మన యేసయ్య నామములో శుభములు కలుగును గాక. అందరూ బాగున్నారా? దేవుడు ఇశ్రాయేలు ప్రజలపై లక్ష్యముంచి చేసిన కార్యములను గూర్చి గత ధ్యానాల్లో విన్నాం కదా! ఐగుప్తు బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలీయులను బయటకు తీసుకురావడానికి ఆయన చేసిన వింతైన కార్యములను గూర్చి నిర్గమాకాండం 7-11 అధ్యాయముల ద్వారా ఈ భాగంలో తెలుసుకుందాం.
ఇశ్రాయేలు పై లక్ష్యం నుంచి వారి మగ పిల్లలను కాపాడుతూ, వారి కొరకు నాయకుని సిద్దపరిచి నడిపిస్తున్న దేవుడు వారిని విమోచించే ప్రక్రియను ప్రారంభించాడు. అందులో భాగంగా ఆయన వింతైన కార్యములు చేయడం ప్రారంభించారు.
దేవునిని లెక్క చేయకుండా, మోషే మాట వినకుండా ఇశ్రాయేలు ప్రజలను మరింతగా శ్రమ పరుస్తున్న ఐగుప్తు రాజుకు, తన ప్రణాళికలో భాగంగా అబ్రహాముకు దేవుడు తెలియపరచినట్టుగానే తీర్పు తీర్చడం ప్రారంభించాడు.
వారు నాలుగు వందల యేండ్లు వీరిని శ్రమ పెట్టుదురు; వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. -ఆదికాండము 15:14
ఈ తీర్పు ఆ ప్రజలకు, ఆ ప్రజలు ఆరాధిస్తున్న దేవుళ్లకు దేవతలకు ఆయన తీర్చాడు అని చెప్పవచ్చు.
ఆ రాత్రి నేను ఐగుప్తుదేశమందు సంచరించి, ఐగుప్తుదేశమందలి మనుష్యులలోనేగాని జంతువులలోనేగాని తొలి సంతతియంతయు హతముచేసి, ఐగుప్తు దేవతలకందరికిని తీర్పు తీర్చెదను; నేను యెహోవాను. -నిర్గమకాండము 12:12
అందులో భాగంగా నైలు నదికి సంబంధించిన ఆరాధన అంతటికి వ్యతిరేకంగా ఆ నదిలోని నీళ్లను రక్తముగా మార్చుతూ, నదిలో చేపలు చనిపోయేటట్లుగా, విపరీతమైన కంపు, ఐగుప్తీయులకు తాగుటకు నీళ్లు లేని పరిస్థితి ఏర్పడునట్లుగా దేవుడు కల్పించాడు.
కప్పకు చేసే ఆరాధన అంతటికి వ్యతిరేకంగా, ఐగుప్తు దేశమంతటి మీదికి దేవుడు కప్పలను రప్పించాడు, అవి చనిపోగా అదొక వాసన. కప్పను ఆరాధన చేసేవారే అది వారి దగ్గర నుండి తొలగిపోవాలని కోరుకున్నారు.
ఎడారిని ఆరాధించినందుకు పేలు, ఈగలను ఆరాధించినందుకు ఈగలు, పశువులను ఆరాధించినందుకు పశువుల మరణం, స్వస్థ పరిచే శక్తి ఉందని పిలవబడే సును, ఇసిస్ అనే దేవతలకు వ్యతిరేకంగా దద్దుర్లు, ఆకాశదేవతకు వ్యతిరేకంగా వడగండ్ల వాన, పంటనిచ్చే దేవతకు వ్యతిరేకంగా పంటను పాడు చేసే మిడతలు, సూర్యదేవునికి వ్యతిరేకంగా మూడు దినాల కటిక చీకటి ఐగుప్తు మీదకు దేవుడు రప్పించాడు.
ప్రతి కార్యములోను దేవుడు తాను సార్వభౌమాధికారం కలిగినవాడని నిరూపించుకున్నాడు, ఈ లోక దేవతలన్నిటికంటే ఆయన గొప్పవాడని చెప్పకనే చెప్పాడు. ఇవన్నీ ఆయన చేయడానికి కారణం ఐగుప్తు మెడలు వంచడమే. ఇవి ఎన్నడూ కనీ విని ఎరగని కార్యం, ఒక ఐగుప్తీయుడు తన జీవితంలో ఎన్నడూ ఊహించని కార్యం.
ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు నీ జీవితంలో కూడా ఇలాంటి కార్యాలు జరిగించాడా? అయితే దేవుని స్తుతించు. ఇశ్రాయేలు వలే శ్రమనుభవిస్తున్నావా నిన్ను విమోచించుటకు వింతైన కార్యములు నేటికీ కూడా చేయగల దేవుడు నీ పక్షాన ఉన్నాడని తెలుసుకో.
ముగింపు :
మన దేవుడు వింతైన కార్యములు చేయువాడని విన్నాము కదా! ఆయన ద్వారా మాత్రమే సాధ్యపడే గొప్ప కార్యములు అన్నిటిని బట్టి ఆయనను స్తుతిస్తూ ఆయనను హత్తుకుంటూ ఈ లోకములోనివారికి ఆయన కీర్తిని ప్రచురము చేద్దాం . ప్రభు చిత్తమైతే మరొక భాగంతో మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు ప్రభువు కృప మనకు తోడైయుండును గాక. ఆమెన్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి