వినాశనమును తప్పించు దేవుడు
విమోచించు దేవుడు, మనందరి విమోచన నిమిత్తమై పస్కా పశువుగా కల్వరి సిలువలో వధించబడ్డాడు, ఆయన రక్తం మన శిక్షను తొలగించింది. నిత్య నరకాన్ని తప్పించింది.
పరిచయం :
క్రీస్తు మరణం మన మరణాన్ని తప్పించింది. సత్యాన్వేష్కులకు మన కొరకు వధించబడిన యేసయ్య నామములో శుభములు కలుగును గాక.
అందరూ బాగున్నారా? దేవుడు ఇశ్రాయేలు ప్రజలపై లక్ష్యముంచి చేసిన కార్యములను గూర్చి వారి విమోచన నిమిత్తమై ఆయన చేసిన వింతైన కార్యాలను గూర్చి గత ధ్యానాల్లో విన్నాం కదా! ఐగుప్తులో గొప్ప వధ జరిగిన సమయంలో ఇశ్రాయేలీయులను ఏ విధంగా కాపాడాడో నిర్గమాకాండం 12వ అధ్యాయము ద్వారా ఈ భాగంలో తెలుసుకుందాం.
దేవుడు ఈ తొమ్మిది తెగుళ్లుతో ఆగిపోలేదు గాని, పిల్లలను కాపాడే దేవతకు వ్యతిరేకంగా ఐగుప్తీయుల తొలి సంతానం మరణించడానికి ఏర్పాటు చేశాడు. అయితే ఇందులో అద్భుతమైన విషయం ఏంటంటే, ఐగుప్తీయుల మీదకు తీసుకురాబడ్డ 10 తెగుళ్లు కూడా అదే ప్రాంతంలో ఉంటున్న ఇశ్రాయేలీయులకు ఏమాత్రం నష్టాన్ని కలిగించలేదు.
మరి ముఖ్యంగా ఈ పదవ తెగులు సంభవించడానికి ముందుగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఒక మాట చెప్పాడు, మరణ దూత మీ ఇంటిని దాటిపోవునట్లుగా ఒక గొర్రె పిల్లను గాని మేక పిల్లను గాని వధించి, ఆ రక్తమును వారి ద్వారబంధముల మీద పూయమని చెప్పాడు.
మరియు హిస్సోపు కుంచె తీసికొని పళ్లెములో నున్న రక్తములో దాని ముంచి, ద్వారబంధపు పైకమ్మికిని రెండు నిలువు కమ్ములకును పళ్లెములోని రక్తమును తాకింప వలెను. తరువాత మీలో నెవరును ఉదయమువరకు తన యింటి ద్వారమునుండి బయలు వెళ్లకూడదు. యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారము చేయుచు, ద్వారబంధపు పైకమ్మిమీదను రెండు నిలువు కమ్ములమీదను ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును; మిమ్ము హతము చేయుటకు మీ యిండ్లలోనికి సంహారకుని చొరనియ్యడు. -నిర్గమకాండము 12:22, 23
ఇశ్రాయేలీయులు ఈ విధంగా చేసినప్పుడు వారి తొలి సంతానం రక్షించబడ్డారు, దేవుడు ఎంత చక్కగా ఇశ్రాయేలీయుల పిల్లలను కాపాడాడో చూడండి, మంత్రసానుల ద్వారా కొంతమందిని, నదిలో కొంతమందిని, ఇప్పుడు పస్కా పశువు ద్వారా అందర్నీ కాపాడాడు.
ఓ పక్క ఐగుప్తీయుల ఇండ్లలో శవము లేని ఇల్లు లేకుండా పోయింది. వారి ఏడుపులతో ఐగుప్త మారుమోగిపోయింది. దేవుడు చెప్పినట్టుగానే ఇశ్రాయేలీయులు ఐగుప్తుల్య ద వెండి బంగారం విలువైన వస్త్రాలు వాటన్నిటిని అడిగి తీసుకున్నారు, అబ్రహం కి దేవుడు ఇచ్చిన మాట చొప్పున వీరు మిక్కిలి ఆస్తితో ఐగుప్తును విడిచిపెట్టారు.
విమోచించు దేవుడు, మనందరి విమోచన నిమిత్తమై పస్కా పశువుగా కల్వరి సిలువలో వధించబడ్డాడు, ఆయన రక్తం మన శిక్షను తొలగించింది. నిత్య నరకాన్ని తప్పించింది, ఇట్టి భాగ్యాన్ని నీవు పొందుకున్న వ్యక్తిగా ఉంటే దేవుని స్తుతించు, నీవింకను ఈ భాగ్యాన్ని పొందుకోకపోతే నశించిపోయే వారి గుంపులో ఉండకుండా నీ కొరకు వధింపబడిన యేసుక్రీస్తు వారి రక్తములో మునుగుటకు తీర్మానించుకుని ఆ భాగ్యాన్ని పొందుకో.
ముగింపు :
మన దేవుడు వినాశమును తప్పించు దేవుడు. మనకు నిత్యజీవము కలుగజేయుట కొరకు ఆయన మన స్థానంలో మరణించాడు. కనుక ఆయన ఇచ్చు రక్షణను పొందుకొని నిత్యశిక్షను తప్పించుకుందాం. ప్రభు చిత్తమైతే మరొక భాగంతో మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు ప్రభువు కృప మనకు తోడైయుండును గాక. ఆమెన్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి