ఊహించని రీతిలో సహాయము చేయు దేవుడు
ఊహించని రీతిలో నీకు సహాయము దొరుకుతున్నదా? అది నీ అదృష్టం అనుకోవద్దు. అదృష్టాలు దురదృష్టాలు లేవు, ఉన్నదల్లా దేవుని నియామకాలే.
పరిచయం :
ఊహించని రీతిలో ఎన్నో సార్లు మనము సహాయం పొంది ఉంటాము, అలా జరిగినప్పుడల్లా అది మన అదృష్టం అని భావించి ఉంటాము.
వాక్యాన్వేషకులందరిని ప్రేమతో రెఫీదీమ్ వాక్య ధ్యాన సమయముకు ఆహ్వానిస్తున్ననాను. అందరూ బాగున్నారా? దేవుడు మన మీద దృష్టి నిలిపినప్పుడు ఎలాంటి కార్యములు జరుగుతాయో, నిర్గమకాండము 1వ అధ్యాయము నుండి తెలుసుకుందాం.
ఈ లోకంలో మనిషి కంటే గొప్పవి చాలానే ఉన్నాయి, కానీ దేవుడు అన్నిటికంటే ఎక్కువగా మనిషి మీద దృష్టి నిలిపేవాడుగా ఉన్నాడు.
దీన్ని అర్థం చేసుకున్న ప్రతి ఒక్కరు కీర్తనకారులతో కలిసి నీవు నరపుత్రుని దర్శించుటకు వారు ఏ పాటివారు అని చెప్పగలరు.
కరువును తప్పించుకోవడానికి ఐగుప్తులోనికి వెళ్ళిన యాకోబు కుటుంబం, కరువు తీరిపోయిన తర్వాత వెనక్కి తిరిగి కనానుకు రాలేదు. యోసేపు చనిపోయిన తర్వాత కూడా ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులోనే నిలిచిపోయారు, వారు వెనక్కి తిరిగి వచ్చే ప్రయత్నం చేయలేదు, 70 మంది గా అడుగుపెట్టిన యాకోబు కుటుంబం కాలక్రమంలో అనగా 400 సంవత్సరాల్లో ఒక గొప్ప జనముగా సుమారు 30 లక్షల ప్రజలుగా మార్చబడ్డారు.
వీరు ఈ విధంగా విస్తరించడాన్ని చూడలేకపోయినా ఆ దేశపు రాజులు వీరిని అణిచి వేయడానికి రకరకాల ప్రణాళికలు సిద్ధం చేశారు. వీరిని అణిచివేయాలనుకోవడానికి ప్రధానమైన కారణం, వీరి యొక్క సంఖ్య మరియు వీరు పరదేశులు కావడమే.
మొదటిగా వీరిని అణచివేయడానికి మగవారిని వెట్టిచాకిరికి లోను చేశారు, మగవారు వెట్టిచాకిరి చేయడం వలన సంతాన ఉత్పత్తి తగ్గిపోతుంది అని భావించారు.
కానీ ఇశ్రాయేలీయుల ప్రజల మీద లక్ష్యముంచిన దేవుడు, శత్రువులు వీరిని ఎంతగా అణచివేస్తున్నా, అంతకంతకు వీరిని విస్తరింప చేయడం ప్రారంభించాడు. మొత్తానికి ఆ ప్రణాళిక బెడిసి కొట్టింది.
ఇక రెండవ ప్రణాళికకు శ్రీకారం చుడుతూ, హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పనిచేసే వారిని పిలిపించి హెబ్రీ స్త్రీలకు మగ పిల్లల పుడితే చంపేయండి ఆడపిల్లలు పుడితే బ్రతకనీయండి అని చెప్పడం జరిగింది.
కానీ ఈ మంత్రసానులు హత్య చేయడానికి ఇష్టపడక దేవునికి భయపడి ఆ పిల్లలను బ్రతకనిచ్చారు
అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి, ఐగుప్తురాజు తమ కాజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రదుకనియ్యగా -నిర్గమకాండము 1:17
దేవుడు మన యందు లక్ష్యం ఉంచినప్పుడు మనకు ఊహించిన రీతిలో ఆయన సహాయం చేసేవాడుగా ఉంటాడు, నిజంగా నిన్ను పుట్టించిన దేవుడు నీ యందు లక్ష్యం ఉంచేవాడై ఉన్నాడు,
ఆయన నీ యందు లక్ష్యం ఉంచి నీకు ఎన్నో రీతులుగా ఆయన సహాయం చేస్తుండగా ఆయనకు హృదయపూర్వకమైన కృతజ్ఞతలు చెల్లించు.
ఊహించని రీతిలో నీకు సహాయము దొరుకుతున్నదా? అది నీ అదృష్టం అనుకోవద్దు. అదృష్టాలు దురదృష్టాలు లేవు, ఉన్నదల్లా దేవుని నియామకాలే.
నీ మీద దృష్టి నిలిపిన దేవుడు నీకు సహాయం చేయడానికి వారిని నియమించాడని గ్రహించి నీకు సహాయం చేసిన వారికి కృతజ్ఞతలు చెల్లించడంతోపాటుగా ఆ రీతిగా వారు సహాయపడునట్లు వారి మనసును ప్రేరేపించి నీ కొరకు వారిని సిద్ధపరిచి ఏర్పాటు చేసిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయనకు మరింత దగ్గరగా జీవించే ప్రయత్నం చేయవలసిందిగా మనవి చేస్తున్నాను.
మాపై లక్ష్యం ఉంచి మమ్మల్ని నడిపిస్తున్న దేవా మేము నీపై లక్ష్యముంచి నీకు దగ్గరగా జీవించే భాగ్యం మాకు దయచేయండి, మా తీర్మానం స్థిరపరచమని మిమ్ములను వేడుకుంటున్నాం.
ముగింపు :
దేవుడు జరిగిస్తున్న కార్యములను బట్టి ఆయన పట్ల కృతజ్ఞతగలవారమై ఆయనతో లోతైన సహవాసము ఏర్పర్చుకుందాం. ప్రభువు చిత్తమైతే మరొక భాగముతో మళ్ళీ కలుసుకుందాం. అంత వరకు ప్రభువు కృప మీకు తోడైయుండును గాక. ఆమెన్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి