ప్రభావము గలవాడు



ప్రభావముగలవాడు

ప్రభావముగలవాడు

శూరుడా, నీ కత్తి మొలను కట్టుకొనుము నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొనుము. -కీర్తనలు 45:3

తేజస్సు అనే మాట ఏసుక్రీస్తు వారు కలిగి ఉన్న వెలుగును తెలియజేస్తే, ప్రభావము అనే మాట ఆయనకున్న శక్తిని, ఘనతను గొప్పతనమును తెలియజేస్తున్నది. ప్రభావము అనే పదాన్ని మన తెలుగు బైబిల్లో ఘనత, సొగసు, తేజస్సు, సౌందర్యము, మహత్యము, మహామహుడు, ప్రభావము అని అనువాదం చేశారు. 

ఇప్పుడు ఏసుక్రీస్తు వారు ప్రభావంగలవాడు అని అంటే ఘనుడు, సొగసరి, తేజస్సుగలవాడు, సుందరుడు, మహత్యము గలవాడు అని చెప్పవచ్చు. సృష్టికి పూర్వమే ఘనుడుగా ఉన్నాడు, లేదా మహిమ గలవాడుగా ఉన్నాడు, అనగా తండ్రి అయిన దేవుడు కలిగి ఉన్న ఘనతలో ఏసుక్రీస్తు వారు భాగం కలిగి ఉన్నాడు

తండ్రీ, లోకము పుట్టకమునుపు నీ యొద్ద నాకు ఏ మహిమయుండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమ పరచుము. -యోహాను 17:5

అయితే ఆయన మనందరి కొరకు ఆ వైభవమును విడిచిపెట్టి సొగసు లేని వాడిగా ఈ లోకానికి వచ్చాడు. ఇంకో మాటలో చెప్పాలంటే మనుషుడిగా మారుట కొరకు పరలోకములో తనకున్న ఘనతను విడిచిపెట్టాడు.

ఆయన దేవుని స్వరూపము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను.-ఫిలిప్పీయులకు 2:6,7
లేతమొక్కవలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయనయెదుట పెరిగెను. అతనికి సురూపమైనను సొగసైనను లేదు మనమతని చూచి, అపేక్షించునట్లుగా అతనియందు సురూపము లేదు. -యెషయా 53:2

భూలోకంలో పరిచర్య చేసినప్పుడు ఆయన మహత్యము వెల్లడి చేయబడింది, పేతురు యోహాను యాకోబులు అందుకు సాక్షులు. రెండు సందర్భాల్లో ఆయన ప్రభావము వెల్లడి చేయబడింది.

ఆయన మహాత్మ్యమును మేము కన్నులార చూచినవారమై తెలిపితివిు. ఈయన నా ప్రియకుమారుడు ఈయనయందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహాదివ్య మహిమనుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు, తండ్రియైన దేవునివలన ఘనతయు మహిమయు ఆయన పొందగా -2 పేతురు 1:17

యెరూషలేములోనికి జయప్రవేశం చేసిన సందర్భంలో ఆయన ఘనత, గొప్పతనము వెల్లడి చేయబడింది.

జనసమూహములలో ఆయనకు ముందు వెళ్లుచుండినవారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. -మత్తయి 21:9

భూలోకంలో తన పని ముగించుకుని పరమునకు ఎక్కిపోయిన తర్వాత దేవుని కుడి ప్రక్కన సింహాసనాసీనుడిగా చేయబడ్డాడు.

ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తి మంతమునైయుండి, తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు, పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి, దేవదూతల కంటె ఎంత శ్రేష్ఠమైన నామము పొందెనో వారికంటె అంత శ్రేష్ఠుడై, ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుం డెను. -హెబ్రీయులకు 1:3,4

ఆయన ప్రభావమును వెల్లడి చేసే దర్శనములు భక్తుడైన యోహానుకు కలిగాయి.

మరియు నేను చూడగా, ఇదిగో తెల్లని మేఘము కనపడెను. మనుష్య కుమారుని పోలిన యొకడు ఆ మేఘము మీద ఆసీనుడైయుండెను ఆయన శిరస్సు మీద సువర్ణకిరీటమును, చేతిలో వాడిగల కొడవలియు ఉండెను. -ప్రకటన గ్రంథం 14:14
మరియు సింహాసనమునకును ఆ నాలుగు జీవులకును పెద్దలకును మధ్యను, వధింపబడినట్లుండిన గొఱ్ఱెపిల్ల నిలిచియుండుట చూచితిని. ఆ గొఱ్ఱెపిల్లకు ఏడు కొమ్ములును ఏడు కన్నులు నుండెను. ఆ కన్నులు భూమి యందంతటికి పంపబడిన దేవుని యేడు ఆత్మలు. ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడైయుండువాని కుడిచేతిలో నుండి ఆ గ్రంథమును తీసికొనెను. -ప్రకటన గ్రంథం 5:6,7
తిరుగగా ఏడు సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన యొకనిని చూచితిని. ఆయన తన పాదములమట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారుదట్టి కట్టుకొనియుండెను. ఆయన తలయు తలవెండ్రుకలును తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలవలె ఉండెను; ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై యుండెను; ఆయన కంఠ స్వరము విస్తార జలప్రవాహముల ధ్వనివలె ఉండెను. ఆయన తన కుడిచేత ఏడు నక్షత్రములు పట్టుకొని యుండెను; ఆయన నోటి నుండి రెండంచులుగల వాడియైన ఖడ్గమొకటి బయలు వెడలుచుండెను; ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యునివలె ఉండెను. -ప్రకటన గ్రంథం 1:13-16
రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రముమీదను తొడమీదను వ్రాయబడియున్నది. -ప్రకటన గ్రంథం 19:16

భూలోకములో సొగసు లేకుండా ఉన్న ఆయన, చూచుటకు రెండు కన్నులు చాలని రీతిలో సౌందర్యవంతుడిగా కనబడుతున్న విధానాన్ని ఈ దర్శనాల్లో చూడవచ్చు. 

మనం ధ్యానిస్తున్న ఈ కీర్తనలో కోరహు కుమారులు ప్రభావమును ఒక ఆభరణము వలె ధరించుకొనమని కోరుతున్నారు. ఆయనకున్న ఘనతను బట్టి ఆయన ఏమి చేయగలడో దానిని చేయమని వారు కోరుతున్నారు. 

వారు కోరినది భవిష్యత్తులో నెరవేరుతుంది. ఒక న్యాయాధిపతి వలె తన అధికారమును కనబరుచు దినాన్న ఆయన ప్రభావం ఏంటో మనం చూడగలుగుతాం, ఆయన సజీవులకు, మృతులకు నీతిని అనుసరించి తీర్పు తీరుస్తాడు.

అప్పుడాయన యెడమ వైపున ఉండువారిని చూచి శపింపబడినవారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతల కును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. -మత్తయి 25:41
దేవుని యెదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తుయేసు ఎదుటను, ఆయన ప్రత్యక్షత తోడు ఆయన రాజ్యముతోడు, నేను ఆనబెట్టి చెప్పునదేమనగా -2 తిమోతికి 4:1
ఎందుకనగా తాను నియమించిన మనుష్యునిచేత నీతి ననుసరించి భూలోకమునకు తీర్పుతీర్చ బోయెడి యొక దినమును నిర్ణయించి యున్నాడు. మృతులలోనుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికిని ఆధారము కలుగజేసియున్నాడు. -అపో.కార్యములు 17:31

ప్రభువైన ఏసుక్రీస్తు వారి యొక్క ప్రభావమును భవిష్యత్తులో మనమందరము చూస్తాము,

ఇది మొదలుకొని మనుష్యకుమారుడు సర్వశక్తుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు, ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా -మత్తయి 26:64
అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి, భూమిమీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందురు. -మత్తయి 24:30

ఏసుక్రీస్తు వారిని తమ హృదయంలో చేర్చుకొనని ప్రతి వ్యక్తి ఆయన ప్రభావ మహిమ నుండి పారద్రోలబడి నిత్యాగ్ని దండన పొందే దినమున్నది.

దేవుని నెరుగనివారికిని, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయునప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమపొందుచున్న మీకు మాతో కూడ విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. ఆ దినమున తన పరిశుద్ధులయందు మహిమపరచబడుటకును, విశ్వసించినవారందరి యందు ప్రశంసింపబడుటకును, ప్రభువు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సముఖము నుండియు ఆయన ప్రభావమందలి మహిమనుండియు పారదోలబడి, నిత్యనాశనమను దండన పొందుదురు. ఏలయనగా మేము మీకిచ్చిన సాక్ష్యము మీరు నమ్మితిరి. -2 థెస్సలొనికయులకు 1:7-10

గొప్ప గొప్ప వారు ఆయన ప్రభావమునకు తట్టుకోనలేక దాగుకునే దినము ఆ దినము.

భూరాజులును, ఘనులును, సవాస్రాధిపతులును, ధనికులును, బలిష్ఠులును, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండల సందులలోను దాగుకొని సింహాసనాసీనుడైయున్నవాని యొక్కయు గొఱ్ఱెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను; దానికి తాళజాలినవాడెవడు? మీరు మామీద పడి ఆయన సన్నిధికిని గొఱ్ఱెపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగు చేయుడి అని పర్వతములతోను బండలతోను చెప్పుచున్నారు. -ప్రకటన గ్రంథం 6:15-17

ఆ దినము రాకముందే దేవుడు మనకు ఇచ్చిన అవకాశంను బట్టి, ఆయన మనకు ఇచ్చిన రక్షణను బట్టి ఆయనకు స్తోత్రము చెల్లిద్దాం.

అటు తరువాత నేను చూడగా, ఇదిగో, ప్రతి జనములోనుండియు ప్రతి వంశములోనుండియు ప్రజలలోనుండియు, ఆయా భాషలు మాటలాడువారిలో నుండియు వచ్చి, యెవడును లెక్కింపజాలని యొక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకొన్నవారై, ఖర్జూరపుమట్టలు చేతపట్టుకొని సింహాసనము ఎదుటను గొఱ్ఱెపిల్ల యెదుటను నిలువబడి సింహాసనాసీనుడైన మా దేవునికిని గొఱ్ఱెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. -ప్రకటన గ్రంథం 7:9,10
అంతట పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము, అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై యున్నవానికిని గొఱ్ఱెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాకని చెప్పుటవింటిని. -ప్రకటన గ్రంథం 5:13

Post a Comment