ఆదికాండము 1వ అధ్యాయము - వ్యాఖ్యానము
ఆదికాండము 1:1 - ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను.ఆదియందు - ఆది అనే ఈ మాట సృష్టి యొక్క ఆరంభమును సూచించుచున్నది కాని సమస్తము యొక్క ఆరంభమును సూచించడం లేదు (ఇతర ఆరంభముల కొరకు మార్కు. 1:1; యోహాను 1:1 చూడండి). ఆరంభము అంతము అనే పదాలు సాధారణముగా కాలమును గురించి మనము వాడతాము. ఆది అంతములు లేని దేవుడు కాలమును(Time), పదార్థమును (Matter), ప్రదేశమును(Space) సృజించాడు. కొంతమంది కాలము నిత్యమైనది అని భావిస్తారు, కాని అది కూడా సృజించబడిందే.
దేవుడు- ఈ వచనము దేవునిని గురించి అనేక విషయాలను స్థాపించుచున్నది. దేవుడు ఉన్నాడని, ఆయన అద్వితీయుడని, ఆయన సార్వభౌముడని, ఆయన సర్వశక్తిమంతుడని, ఆయన ప్రేమగలవాడని, ఆయన సృష్టికర్తని, ఈ వచనం తెలియజేస్తున్నది. ఈ వచనములో ఆదియందు దేవుడు ఏం చేశాడో రాయబడింది. దేవుడు లేడనే వాదాన్ని కొట్టివేస్తూ, ఆయన అద్వితీయుడు అనే సిద్ధాంతాన్ని స్థాపిస్తూ ఆయన చేసిన కార్యములను ఈ వచనం వివరిస్తూ ఉన్నది.
ఆదియందు దేవుడు ఏం చేశాడో ఇక్కడ రాయబడింది, కానీ దేవుడు ఆది అంతములు లేనివాడు అనే విషయాన్ని మనం గ్రహించవలసి ఉన్నది. ఆది అంతములు కాలపరిమితిని, జనన మరణాలను, సృష్టింపబడి నాశనం చేయబడటాన్ని సూచిస్తుండగా దేవుడు వీటన్నిటికీ అతీతుడై ఉన్నాడని గ్రహించాలి.
భూమ్యాకాశములను - ఈ పదం ఇక్కడ కేవలం భూమిని ఆకాశమును మాత్రమే కాక దేవుడు చేసిన సృష్టి అంతటిని సూచిస్తూ ఉన్నది. విశ్వమును సూచించే పదము హెబ్రీ భాషలో లేకపోవడం ద్వారా, విశ్వమును ఉద్దేశించి చెప్పవలసి వచ్చినప్పుడు "భూమ్యాకాశములు" అని చెప్పడం జరిగింది. కాబట్టి "భూమ్యాకాశములు" అనే పదములు అలంకార రూపములో (Figure of Speech) రాయబడినవని గ్రహించాలి. ఇక్కడ ఉపయోగించబడిన అలంకారమును ఆంగ్లములో మెరిజం (Merism) అని పిలుస్తారు. దేవుడి సృష్టినంతటని కలుగజేశాడు అనే విషయాన్ని ఈ వచనం మనకు సంక్షిప్తంగా తెలియపరుస్తుందని గ్రహించాలి. తర్వాత వచనము నుండి దేవుడు దాన్ని ఎలా కలుగజేసాడో మరింత స్పష్టంగా వివరించబడింది.
సృజించెను - దేవుడి ఈ లోకాన్ని సృజిస్తే దేవుడు ఎవరు సృజించారు అని కొంతమంది అడుగుతూ ఉంటారు, ఆయన సృజించేవాడే గాని సృజింపబడినవాడు కాదు. దేవుడు సృష్టికర్త అనే విషయాన్ని ఈ వచనము మనకు తెలియజేస్తున్నది. ఈ లోకమును సృష్టించిన సృష్టికర్తకు తాను సృష్టించిన సృష్టము పట్ల ఒక ఉద్దేశం కలిగిన వాడుగా ఉన్నాడు, ఇంకో మాటలో చెప్పాలంటే దేవుడు తప్ప ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి ఇంకొకరి కోసం చేయబడింది.
స్వయంభవుడు, నిత్యుడు, అద్వితీయుడు, సృష్టికర్తయైన దేవునిని నీవు తెలుసుకున్నావా? ఆయనతో సంబంధం కలిగి ఆయనను స్తుతిస్తున్నావా? వ్యర్థమైన వాదములను విడిచిపెట్టి, అనిత్యమైన వాటిపైన విశ్వాసము ఉంచుట మానుకొని ప్రేమగల సృష్టికర్తను చేరుకొని ఆయనను స్తుతిస్తూ దీవెనలు పొందువారంగా ఉందాము!

కామెంట్‌ను పోస్ట్ చేయండి